పదవ తరగతిలో ఉన్న ప్రసిద్ధ శ్లోకాలు -భావాలు

పదవ తరగతిలో ఉన్న ప్రసిద్ధ శ్లోకాలు - భావాలు:

శ్లో:
మానిషాద ప్రతిష్ఠాంత్వ
మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచ మిథునాదేకమ్
అవధీః కామమోహితమ్||


కామమోహితమ్ = కామవ్యామోహములో ఉన్న
 యత్క్రౌంచ మిథునాత్ = ఏ కొంగలజంటలోనుండి
ఏకం = ఒక దానిని(మగ పక్షిని)
అవధీః = చంపితివి
త్వం = నీవు
శాశ్వతీః సమాః = శాశ్వతమైన
ప్రతిష్ఠాం = కీర్తిని
నిషాద = బోయవాడా
మా అగమః = పొందవు పో
అనగా ఎక్కువ కాలం నీవు జీవింపవు.అంటే మరణింతువు గాక అని భావము (శాపము).

భావం:- ఓ కిరాతుడా! క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు.


కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్యకవితా శాఖాం వందే వాల్మీకీ కోకిలమ్ ||

భావం : కవిత్వమనే కొమ్మనెక్కి తియ్యనైన అక్షరాలగల రామ రామ అనే పేరును చెవులకు ఇంపుగా పలుకుచున్న వాల్మీకి మహర్షి అనే కోకిలకు నమస్కారాలు.

రామోవిగ్రహవాన్ ధర్మః 
సాధుః సత్యపరాక్రమః|
రాజా సర్వస్యలోకస్య 
దేవానాం మఘవానివ||

భావం: శరీరం ధరించి దిగివచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణికోటికి హితవు కలిగించే సాధుజీవనుడు.
అతని పరాక్రమానికి తిరుగులేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువు అయినట్టే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ రాముడు.
( మారీచుని నోట పలికిన పలుకులు)

రాజ్ఞి ధర్మిణి ధర్మిష్ఠా,
పాపే పాప పరాః సదా|
రాజానమనువర్తంతే 
యథా రాజా తథా ప్రజా||

భావం: రాజు ధర్మ పరుడైతే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. రాజు పాప వర్తనుడైతే రాజ్యం పాప పంకిలం అవుతుంది. రాజును అనుసరించే ధర్మాధర్మాలు నడుస్తాయి. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా నడుచుకొంటారు. రాజును అనుసరించే ప్రజలు నడుచుకొంటారని భావం.


✍ పైడి నాగ సుబ్బయ్య.

Post a Comment

0 Comments