*ఆత్మావై పుత్రనామాసి* నాలుగు వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో మంత్రాలు, ప్రార్థనలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగాల్లో కర్మలు (rituals) గురించి చెప్పబడ్డాయి.

*ఆత్మావై పుత్రనామాసి*
---------------------------------


నాలుగు వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో మంత్రాలు, ప్రార్థనలు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగాల్లో కర్మలు (rituals) గురించి చెప్పబడ్డాయి.
మనిషి జననానికి ముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుంచి మరణించేదాకా అతని జీవితంతో 16 రకాల సంస్కారాలు (కర్మలు) ముడిపడి ఉంటాయని హిందూ మతం చెబుతుంది. వీటిని 'షోడశ సంస్కారాలు' అంటారు. ప్రతి హిందువు తన జీవితం మొత్తంలో ఇది జరుగుతాయి. గర్భదానం మొదలుకొని అంత్యేష్టి (మరణం) వరకు ఇవి 16 రకాల సంస్కారాలు. ఇందులో నాలుగవ కర్మ *జాతకర్మ.*
జాత = జననం, పుట్టుక
కర్మ = చేసే పని
నవ మాసాలు తల్లి గర్భంలో ఉండి, బయటకు వచ్చిన శిశువుకు చేసే మొదటి సంస్కారం జాత కర్మ. (మొత్తం షోడశ కర్మలలో ఇది నాలుగవది. గర్భదానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ.....)
ఇప్పుడు అన్ని కులాల్లో ఈ కర్మ చేస్తున్నట్లయితే కనిపించదు. బిడ్డకు బొడ్డుతాడు కోయక ముందు చేసే కర్మ ఇది. అయితే బొడ్డుతాడును ఇప్పుడు ప్రసవించిన వెంటనే తీసేస్తున్నారు. అందువలన ఇప్పుడు కొందరు దీన్ని 11వ రోజు చేస్తున్నారు. ఇది ప్రాథమికంగా శౌచ ( శరీరాన్ని శుభ్రపరచడం ) క్రియకు చెందినది. ఈ కర్మ చివరిలో తండ్రి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టుకుని, ఋగ్వేదంలోని ఒక శ్లోకం చెబుతాడు.
_"అంగాదంగాత్ సంభవసి !_ _హృదయాదధిజాయసే_
*ఆత్మావై పుత్రనామాసి* _త్వంజీవశరదాంశతం !_"
అంగాదంగాత్ సంభవసి != నా ప్రతి అవయవం నుంచి నీవు ఉద్భవించావు ( అచ్చం నా (తండ్రి) ప్రతిరూపమే)
హృదయాదధిజాయసే = నా హృదయం నుంచి జన్మించావు.
నా శరీరాన్ని పోలిన శరీరంతో మాత్రమే నువ్వు పుట్టలేదు... మనసు కూడా అచ్చం నాలాంటిదే మరి!
*ఆత్మావై పుత్రనామాసి* = నా ఆత్మ మరో రూపం పొంది నీలా నేను (పుత్రుడుగా) ఈ భూమి మీద తిరుగుతాను.
అంటే ఓ పుత్రా! నువ్వు ఎవరో కాదు.... నేనే నువ్వు.
త్వంజీవశరదాంశతం ! = నీవు నూరేళ్ళు వర్ధిల్లు!
ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. 'ఆత్మావై పుత్రనామాసి' ఈ పాదంలో తండ్రికి పుత్రుడికి మధ్య ఉన్న సంబంధబాంధవ్యం చెప్పబడింది. శరీరం తండ్రి అయితే ఆత్మ పుత్రుడు. తండ్రి బింబమైతే కొడుకు ప్రతిబింబం .తండ్రి తన శీలం, నడవడిక, ధర్మం - ఇవి నిలవటం కోసం స్వయంగా తన ఇల్లాలి గర్భంలో ప్రవేశించి కుమారుడై జన్మిస్తున్నాడు. తండ్రి పుత్రుడికి ఉపదేశించిన మొదటి మాట ఇది.
తొలి వేద కాలంలో ( క్రీ. పూ. 1500 - 1000) మాతృ స్వామ్య వ్యవస్థ ఉండేది కాబట్టి స్త్రీకి గౌరవం ఉండేది. మలివేద కాలంలో (క్రీ. పూ. 1000 - 600) పితృ స్వామ్య వ్యవస్థ వలన పురుషాధిక్యం ఏర్పడి, ఆనాటి సమాజంలో స్త్రీ గౌరవం క్రమంగా తగ్గింది. అందువలన చాలా శ్లోకాలను పురుషులకు ఆపాదించుకుని, వక్రభాష్యం చెప్పారు.
" అపుత్రస్య గతిర్నాస్తి" అనేది శ్లోకం. పుత్రులు లేనివారికి ఉత్తమ గతులు కలుగవు అని దీని సారాంశం. . అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు సృష్టిని కొనసాగించాలని... సృష్టి కొనసాగడానికి వివాహ వ్యవస్థ ద్వారా చేయూతనివ్వాలని.... అలా కొనసాగించకపోవడం అంటే అధర్మమేనని భావించేవారు.
ఇక్కడ పుత్రులు అంటే కొడుకు లేదా కూతురు అని అర్థం. సృష్టిలో ఇద్దరు ఉంటారు కదా!
కానీ *పుత్రుడు* అనే పదానికి పున్నామ నరకం నుంచి కాపాడే వాడు - కొడుకు అని వ్యుత్పత్తి చెప్పారు. మరణం తర్వాత సంభవించే 14 నరకాలలో 'పున్నామ నరకం' కూడా ఒకటి. పుత్ + నరకం.
పుత్రులు లేని వారికి కలిగే నరకం అన్నమాట. అంతేగాని కొడుకు లేని వారికి కలిగే నరకమని కాదు.
పై శ్లోకం లాగే 'ఆత్మావై పుత్రనామాసి' శ్లోకంలో కూడా పుత్ర = కొడుకు లేదా కూతురు అని అర్థం లోనే తీసుకోవాలి. కొడుకు అని కాదు. కూతురైన కొడుకు అయినా తల్లి గర్భం నుంచి రావలసిందే. తల్లిదండ్రుల జన్యు లక్షణాలను పంచుకోవాల్సిందే. కొడుకుకు మాత్రమే తండ్రి రూపం వస్తుందా? కూతురుకు రాదా? ఇవన్నీ వేదాలకు తర్వాత కాలంలో రాసిన వక్ర భాష్యాలు.
*'ఆత్మావై పుత్రనామాసి'* ఈ వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోండి. తండ్రి ఇలా అంటున్నాడు.... "ఓ పుత్రా! ( కొడుకు లేదా కూతురు) నేను ఈ సృష్టి కార్యంలో ఒక భాగమై.... నా వంతుగా నీ తల్లి ద్వారా నీకు ఈ జన్మనిస్తున్నాను . నువ్వు నా ప్రతిరూపం. ఈ శరీరం మాత్రమే నాది. నా ఆత్మ మీ రూపంలో (కొడుకు/ కూతురు) భూమి మీద నడయాడుతున్నది" అని అర్థం.
మనం ఇక్కడ పుత్ర శబ్దానికి కేవలం కొడుకు అని అర్థాన్ని తీసుకుంటే..... 9వ తరగతి తెలుగు వాచకంలో 'ధర్మబోధ' పాఠానికి ముందుగా ఇచ్చిన (చదవండి - చర్చించండి) తల్లిదండ్రులు తమ పిల్లలను దీవిస్తున్నట్లు ఉన్న చిత్రాన్ని ఆధారంగా చేసుకుని పక్కనే ఉన్న ఈ "ఆత్మావై పుత్రనామాసి" కి వివరణ ఇవ్వడం కష్టం అవుతుంది. ఎందుకంటే ఆ చిత్రంలో కొడుకు, కూతురు ఇద్దరు ఉంటారు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేకించి ఆ పక్కన కూతురు చిత్రం కూడా ఉంటుంది.
దంతుర్తి శర్మగారు రాసిన ఈ వచన కవిత చివరి భాగం చూద్దాం. మన టెక్స్ట్ బుక్ లో ఎడిట్ చేశారు.
"ఈ బాకీలన్నీ మేమెలాగా తీర్చమని తెలిసీ మాకెందుకిచ్చావని అడిగినప్పుడు ఎక్కడ కనిపిస్తుందో అనే నవ్వుని మొహంలో అలాగే కనపడకుండా దాచిపెట్టి
నువ్వు చెప్పిన వాక్యం గుర్తుందా? “నాకు నేను చేసుకున్నదిరా ఇదంతా నీకు చేశాననుకున్నావా!
ఆత్మావై పుత్రనామాసి.”
వృద్ధాప్యంలో తండ్రికి పిల్లలు అడుగుతున్నారు... "నాన్నా!.... మేము పుట్టినప్పటినుంచి మా కోసం ఎన్ని త్యాగాలు చేసావు.. దీనికి మేము నీకు ఋణపడి ఉన్నాం. ఈ బాకీ మేము తీర్చలేము అని నీకు తెలుసు కదా!"
అని మేము అడిగినప్పుడు నీ ముఖంలో కనిపించే చిరునవ్వు మాకు ఏం సమాధానం చెబుతుందో తెలుసా... " ఒరేయ్ పిచ్చి సన్నాసుల్లారా (సన్యాసినుల్లారా కూడా) ఇదంతా నేను మీకోసం చేశానట్రా.... నా కోసం నేను చేసుకున్నది రా... పిల్లలు, తండ్రి వేరు కాదు పిల్లలు తండ్రి ఆత్మ... నా ఆత్మ గురించి, నా గురుంచి నేను చేసుకున్నది" అని చెప్పడాన్ని అర్థం చేసుకోవచ్చు. దుష్యంతుడు తన పుత్రుడిని నిండు సభలో నిరాకరించగానే శకుంతల ఏడ్చి, గగ్గోలు పెట్టలేదు. తండ్రి ధర్మాన్ని బోధించింది. " ఓ రాజా! మీరు అవునన్నా, కాదన్నా వీడు ( భరతుడు) మీ కొడుకు. కొడుకు అంటే తండ్రి ఆత్మ.. వీడు ఎక్కడున్నా మీరు వాడితోనే ఉంటారు " అంటూ ధైర్యంగా శకుంతల చేత చెప్పించారు నన్నయ భట్టు.
   ---------------------------------------
          _కృష్ణారావు దుమ్ము_

Post a Comment

0 Comments