నలభీమపాకం

"నలభీమపాకం"
                04-01-2023
నలుడు నిషిధ దేశ రాజు. అతని భార్య దమయంతి. స్వయంవరంలో దమయంతి నలుని వరించిందని తెలిసిన "కలి" అతనిపై ఈర్ష్య పెంచుకున్నాడు. ఒకనాడు నలుడు అశుచిగా ఉన్నప్పుడు అతడిలో కలి ప్రవేశించి అతడిని నానా ఇక్కట్లపాలు చేసి చివరికి రాజ్యభష్టుడిని చేశాడు. రాజ్యాన్ని కోల్పోయిన నలుడు భార్యతో అరణ్యానికి వెళ్ళాడు. కానీ ఆమె కష్టపడటం ఇష్టం లేక ఆమె తనను విడిచి తండ్రిని చేరాలని భావించి ఒక రాత్రి వేళ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకసారి అరణ్యంలో మంటల మధ్య చిక్కుకున్న కర్కోటకుడనే నాగును రక్షించాడు. అది అతడిని కాటు వేసి కురూపిని చేసింది. అప్పుడు అతడు "బాహుకుడు" అనే మారుపేరుతో ఋతుపర్ణుడనే రాజు కొలువులో వంటవాడిగా చేరాడు. దమయంతి స్వయంవరానికి వచ్చిన దిక్పాలుర వరాల వల్ల నలుడికి స్మరణ మాత్రాన అగ్నిని, నీటిని, సుగంధ ద్రవ్యాలను పొందే కొన్ని శక్తులు వచ్చాయి. అతడు వండే వంటలు మంచి రుచి కలిగి,మంచి సువాసనలతో ఉండేవి. ఆ విధంగా అతడు వంట ఋతుపర్ణ రాజు మెప్పు పొందింది. పాండవులు రాజ్య బ్రష్టులై అరణ్యవాసం ముగిశాక అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు మారువేషాలతో విరాటరాజు కొలువులో పనిచేసేవారు. అప్పుడు భీముడు "వలలుడు" అనే మారుపేరుతో వంటవాడిగా ఉండేవాడు. అతడు తన పాకశాస్త్ర ప్రావీణ్యంతో అతని మెప్పును పొందాడు. పురాణ పురుషులైన నలుడు, భీముడు పాకశాస్త్రంలో ప్రవీణులు. ఈ విధంగా వంటవాళ్లయిన పురాణ పురుషులు మరెవరూలేరు. వంట రుచిగా ఉందని తెలిపేందుకు "నలభీమపాకం"అనడం పరిపాటి అయింది.
రచయిత:-ధరణీప్రగడ శేషగిరిరావు
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

Post a Comment

0 Comments