అనర్గళంగా మాట్లాడుతున్నాడు అని ప్రశంసిస్తూ ఉంటారు. ధాటిగా, ఆపు లేకుండా, ధైర్యం గా మాట్లాడుతున్నపుడు ఈ రకమైన ప్రశంసలు సహజమే.
ఐతే ఈ పదం అర్థం ఏమిటి?
గళం సరే తెలిసిందే . గొంతు, కంఠస్వరం అని దీని అర్థం. అర్గళము అంటే గడియ మాను . (Wooden bolt.) రాజుల కోటలకూ , దేవాలయాలకూ ఉండే పెద్ద పెద్ద తలుపులు మూసేటప్పుడు పెద్ద లావుకొయ్యలను అడ్డంగా పెట్టేవారు. అవి తోసివేయడానికి వీలుకానివిగా , దృఢంగా నిలిచేవిగా ఉండేవి. వీరుల భుజాలకు ఆ అర్గళాలను ఉపమానంగా చెబుతూ ఉంటారు.
నన్నయ భట్టు ఆశ్వాసాంత పద్యాలలో రాజరాజనరేంద్రుడి పరాక్రమం వర్ణిస్తూ —
వైరివేదండగండ విదారి ఘోరతరాసి భాసి భుజార్గళా ! అని సంబోధిస్తాడు.(ఆది పర్వం 3–228)
[శత్రువీరుల ఏనుగుల గండభాగాలను ( చెక్కిళ్ళను) చీల్చివేసే మహాఖడ్గం ధరించే అర్గళము వంటి ఘన భుజం కలవాడా! అని భావం]
అనర్గళంగా = అర్గళం లేకుండా. ( న + అర్గళ = అనర్గళ) అంటే— *ఏ అడ్డూ లేకుండా ధారాళంగా* అని అర్థం. ఇక్కడ అనర్గళానికి 'గళం' (గొంతు) తో ఏ సంబంధమూ లేదు.
(సేకరణ : Quora)

0 Comments