29-05-2024
నీళ్లు పట్టడం తెలుసు... కాళ్లు పట్టడమూ తెలుసు. కానీ, "భరతం పట్టడం" ఏమిటి?బుద్ధి చెప్పడం, గుణపాఠం చెప్పడం, సంగతి తేల్చడం" లాంటి అర్థాల్లో వాడే జాతీయం అది. అందులో ఏముంది! అంటారా? అర్థం సంగతి సరే అసలు ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది. భారతీయ శాస్త్రీయ నృత్య పద్ధతులన్నింటికీ ఓ సమాన లక్షణం ఉంది. అది హస్త పాద విన్యాసం. లయబద్ధంగా, తాళానుగుణంగా చేసే అవయవ విన్యాసం. ఇది సామాన్యుడికి ప్రయాసతో కూడిన పని. తకథిమీ లాంటి ధ్వనులు సరిగమలను గుక్కతిప్పుకోకుండా ఎవరో పాడుతుంటే నర్తకులు అందంగా ఆడుతుంటారు. అలా పాడటమే "భరతం పట్టడం". భరతుడి నాట్య శాస్త్రంలోని సంగీత భాగాన్ని అంటే భరతాన్ని పడితేనే (పని పట్టడం, పట్టు పట్టడం, గుర్తుపట్టడం తదితర పదాల్లోని పట్టడమే ఇదిను!) అవతల వ్యక్తి ఆడతాడు అన్నమాట. ఆవలి వ్యక్తిని ఏడిపించడం,బాధించడం, వేధించడం, కష్టపెట్టడం, అతనికి బుద్ధి చెప్పడం అని అర్థాల్లో ఇది జాతీయంగా మారిపోయింది. కళింగాంధ్రలో ఇది "తాళం పట్టడం" గాను వ్యవహారంలో ఉంది.ఇక "భరత వాక్యం"కూడా ఇలాంటి జాతీయమే. నాట్యానికి కానీ నాటకానికి కానీ మొదట నాంది ప్రస్తావన చేయించడం, చివరిలో భరత వాక్యం చెప్పించడం సంప్రదాయం. ఇది మంగళాచరణంలో సాగుతుంది. ఒక పని లేదా విషయం పూర్తయిందని చెప్పడాన్ని భరత వాక్యం అంటారు. ఆ ముగింపు కూడా మంగళప్రదంగా శుభకరంగా జరిగిందని భావం.విషయం ఏదైనా అది ముగిసిందని సూచిస్తే భరత వాక్యం చెప్పినట్టే లెక్క. సభ నిర్వహణలో ఉపన్యాసాలు చర్చలు ముగిసిన తరువాత చివర్లో "వోట్ ఆఫ్ థాంక్స్" చెప్పడాన్ని భరత వాక్యం అనవచ్చు. పరమాన్నంలో జీడిపప్పులా మన మాటల మధ్యలో తళుక్కుమని జాతీయాలు లోతుల్లోకి వెళితే ఇలాంటి ఆసక్తికర విశేషాలు ఎన్నో కనిపిస్తాయి.
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

0 Comments