ఆశ్రమం,ఆశ్రయం ఈ రెండు పదాల మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి చెప్పగలరు.

*ఆశ్రమం - ఆశ్రయం* 
    ---------------------------------


ఆశ్రమం = శాల, మఠం, పూర్వం రోజుల్లో  జ్ఞాన సముపార్జన చేసే విద్యార్థులు, సన్యాసులు ఉండే చోటు. ఆశ్రమ పాఠశాలలు అంటున్నాం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, వసతి సౌకర్యం కల్పించిన పాఠశాల ఆశ్రమ పాఠశాల. 
ఉదా : అది వాల్మీకి మహర్షి ఆశ్రమం.
ఆశ్రమ భేదాలు నాలుగు : బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థు ఆశ్రమం,  వానప్రస్థ ఆశ్రమం, సన్యాస ఆశ్రమం. 
ఆశ్రమం అంటే  *చోటు* అన్నాం కదా... వయసును ఆధారంగా చేసుకుని ఏ వయసులో ఎక్కడ ఉండాలో (ఏ చోటులో ఉండాలో) చెప్పేది ఆశ్రమ ధర్మం. 
బాల్యంలో విద్యాలయంలో ఉంటే అది బ్రహ్మచర్య ఆశ్రమం. బ్రహ్మజ్ఞానాన్ని అంటే నాలుగు వేదాల్లో ఉన్న సారాన్ని అధ్యయనం చేస్తున్న కాలము అని అర్థం.
గృహస్థశ్రమమ :  ఆశ్రమము అంటే చోటు అనుకున్నాం కదా...  ఇంటిలో భార్య పిల్లలతో నివాసం ఉండే చోటు... ఇల్లు. ఆ ఇంటిలో కాపురం చేసే దశ. 
వానప్రస్థ ఆశ్రమము :  పిల్లలు పెరిగి, పెద్దయి ఎదిగి వచ్చే సమయానికి తాను ఆధ్యాత్మిక చింతనలో పడే దశ.  ఈ దశలో ఉండాల్సిన చోటు అడవి. ఒంటరితనం అలవాటు కావాలి. దేహం విడిచి పెట్టడానికి అవసరమైన సన్నద్ధత ఈ దశ నుంచి మొదలవుతుంది. 
సన్యాసాశ్రమం :  భిక్షాటన చేసుకుంటూ... వివిధ చోట్లు తిరిగే దశ. పుణ్యక్షేత్రాలు, ఋషి పుంగవుల ఆశ్రమాలను  సందర్శించుకుంటూ.... మోహ బంధాలను విడిచిపెట్టి  మానసిక ధైర్యాన్ని సంపాదించుకునే దశ ఇది.
 కాబట్టి ఆశ్రమము అంటే చోటు అని అర్థం.
ఆశ్రయం = అండ, ప్రాపు ( support) 
ఉదా : అనాథ బాలలకు ఆశ్రయం కల్పించాము. 
 ఆశ్రయము అనే పదానికి ఇల్లు/ ఆధారం అని అర్ధాలు కూడా  ఉన్నప్పటికీ.... ఆ ఇల్లు ఎలాంటిదవుతుందంటే  ఒకరు తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఉండే చోటును వదిలి ఇతరులు దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు అది *ఆశ్రయం* అవుతుంది. 
ఉదా : నేను అతనికి ఆశ్రయం కల్పించాను. 
వరద బాధితులు అక్కడ ఆశ్రయం పొందారు. 
శత్రువుల నుంచి పీడించబడుతూ....  ఇతరుల ప్రాపు కోరుకోవడం ఆశ్రయం. ఆశ్రయం ధాతువు నుంచి వచ్చినది ఆశ్రితుడు అనే పదం. ఒకరి చెంత చేరి, వారి పంచన జీవించేవాడు అని అర్థం. ఆశ్రిత పక్షపాతం అనే మాట కూడా ఉంది. ఆశ్రితులు అంటే  ఆశ్రయం కోరి/ శరణు కోరి వచ్చే వారిని అర్థం. 
ఆశ్రమం -  ఆశ్రయం రెండు ఒకేలాంటి అర్థాలు చూపిస్తున్నా వాడుతున్న సందర్భాలు వేరని గమనించాలి. 
 ఆశ్రమం అంటే ఒక చోటు అని అర్థం.
 ఆశ్రయము అంటే  ఒకరు తామ ఉన్నచోట ఉండలేక, పీడించబడుతూ  ఇతరుల పంచకు చేరడం.
    ----------------------------------
       _కృష్ణారావు దుమ్ము_

Post a Comment

0 Comments