*గండ భేరుండ పక్షి :*
-------------------------------
గండ + భేరుండ అనే రెండు పదాల కలయిక ఇది.
గండ ( తెలుగు పదం ) : పెద్ద, మగ, వీరత్వము
భేరుండము : ( సంస్కృత పదము)
కాబట్టి ఇది ఒక *మిశ్ర సమాస పదమని* తెలుస్తున్నది.
భేరుండము అనే పక్షి ప్రస్తావనను పక్షి శాస్త్రవేత్తలు (ఆర్నితాలజిస్ట్) ఎవరూ అంగీకరించరు. ఇది కేవలం చందమామ పత్రికలో వచ్చే జానపద కథల్లో కనిపించే ఒక ఊహ జనితమైన పక్షి. రెండు తలలూ, మూడు కన్నులు ఉండేవని కథల్లో రచయితలు వర్ణించారు. బహుశా మిగతా పక్షుల కంటే కూడా ఇది భిన్నమైనది అని చెప్పేందుకే పక్షులకు లేని అసాధారణ లక్షణాలను ఈ పక్షికి ఆపాదించి ఉంటారు. నవీన కాలంలో ఈ పక్షి ఉనికి ఉన్నట్టు ఎవరూ అంగీకరించరు. దీనికి సరిగ్గా సరిజోడి అయినా శత్రువు శరభము అనే పేరు గల మృగం ఒకటి ఉండేదని.... ఆ శరభం ఎలాంటిదంటే అడవికి రాజు అయిన సింహాన్ని.... బలమైన ఏనుగులను కూడా చంపేదని... అలాంటి శరభ మృగాన్ని సైతం చీల్చి చెండాడి, మట్టికరిపించగల శక్తి ఈ గండభేరుండ పక్షికి ఉండేదని కేవలం కవుల కల్పన మాత్రమే. అయితే ఇలాంటి సాహస కృత్యాలు చేయడం, వీరత్వాన్ని ప్రదర్శించడం అనేది సున్నితమైన ఆడజాతికి సాధ్యం కాదని.... మొరటుగా ఉండే మగ జాతికి మాత్రమే సాధ్యమని ఈ భేరుండ పక్షికి ముందు 'గండ' శబ్దాన్ని జోడించి ఉంటారు.
అందువలన 'గండభేరుండ పక్షి' అయింది. ఈ గండభేరుండ పక్షే గరుత్మంతుడు అన్నవాళ్లు లేకపోలేదు. కానీ గండభేరుండ పక్షికి ఉన్న రెండు తలలూ,మూడు కన్నుల వలన ఇది గరుత్మంతుడు కంటే భిన్నమైన పక్షని మాత్రం తెలుస్తోంది.
బూదరాజు రాధాకృష్ణ గారు *'గండభేరుండ కవుల'* గురించి ప్రస్తావించారు. పూర్వం రోజుల్లో కొంతమంది కవులు తమకు ఆశ్రయమిచ్చే రాజులచే *'కవి గండభేరుండ* ' అని పిలిపించుకోవాలని చాలా ఉబలాట పడేవారట. సంస్కృతాంధ్రాలలో ఎంతో పాండిత్యం కలిగిన కవులు ఇలాంటి మిశ్ర సమాస పదాన్ని బిరుదుగా స్వీకరించడానికి ఎందుకు ఇష్టపడి ఉంటారు? ఇందాక మనం చెప్పుకున్నట్టు గండభేరుండ పక్షి అనేది సింహాలు, ఏనుగులను కూడా చంపుతుంది అన్నాము కదా! ఆనాటి కాలంలో కవులకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన బిరుదు 'కవి సింహ'... అలాంటి కవి సింహాలాంటి కవులను కూడా ఓడించే శక్తి ఈ గండభేరుండ కవులకు ఉందేమో మరి అని అన్నారు.
గండభేరుండ పక్షి అనగా ఒక ఊహాజనిత పక్షి. ఇది బలీయమైన పెద్ద శరీరాకృతిని కలిగి, రెండు తలలూ, మూడు కన్నులతో వీరత్వం చూపించే ఒక అసాధారణమైన మగ పక్షి.
-------------------------------
_కృష్ణారావు దుమ్ము_
0 Comments