నేనే గొప్పవాడిని నాకంటే గొప్పవారు ఎవరు వుండరు అని భావించేవారికి ఎవరైనా బుద్ధిచెప్పి అతని కంటే గొప్పవాడు అని నిరూపించుకుంటే ఈ నానుడి వాడుతూ వుంటారు. ఈ నానుడి ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో తెలియదుగానీ, మొత్తానికి ఓ జరిగిన సంఘటన ద్వారా ఈ నానుడి వాడుకలోకి వచ్చినట్టు భావించవచ్చు. ఈ నానుడి ఎలా వచ్చిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోవొచ్చు.
పూర్వం ఆచంట అనే ఊర్లో మల్లన్న అనే యువకుడు ఉండేవాడు. అతను బాగానే చదువుకున్నాడు గానీ ఉద్యోగం రాలేదు. ఉపాధిగా ఓ చిన్న పాకా హోటల్ పెట్టుకుని జీవిస్తున్నాడు. సంపాదన ఎక్కువ రాక పోయినా ఏ రోజు కారోజు డోకా లేకుండా గడిచిపోతుంది. భార్య లోపల వంట పని, గిన్నెలు కడిగే పని చేస్తుండేది. మల్లన్న హోటల్లో తినుబండారాలు అందించటం, డబ్బులు తీసుకోవడం చేస్తుండేవాడు.
ఒకరోజు ఓ వ్యక్తి హోటల్ కు వచ్చాడు. అతడు ఆ ఊరులో జరిగే సంతలో ఎండు మిరపకాయలు అమ్మేవాడు. అతడు పెద్ద పిసినారి. ఏదో ఒక వంకతో ఉచితంగా తినిపోవాలని అతడి ఆలోచన. "మల్లన్నా! నా దగ్గర డబ్బులు లేవుగానీ ఈ సారి వచ్చి నప్పుడు ఇచ్చిపోతా తినమంటావా?" అని అడిగాడు.
మల్లన్న తలెత్తి చూసి అతడి పన్నాగం అర్ధం చేసుకున్నాడు. "అలాగలాగే శెట్టి గారు తినండి. కానీ ఈసారి వచ్చినప్పుడు తప్పకా డబ్బులు ఇస్తారుగా?" అని అడిగాడు.
"అయ్యోయ్యో ఎంతమాట. నీ రుణం నాకెందుకు? వెంటనే తీరుస్తా" అని గొంతువరకు తిన్నాడు. ఖాతా పుస్తకంలో 3 రూపాయలు అని రాసి సంతకం పెట్టి వెళ్ళాడు. ఇక హోటల్ కు రావటం ఆపేసాడు. ఎప్పుడైనా ఇద్దరు కలుసుకున్నప్పుడు కూడా ఆ బాకీ ప్రస్తావన రాలేదు. మల్లన్న అడగలేదు. శెట్టి ఇవ్వలేదు. నెలలు గడిచాయి. మల్లన్న మర్చిపోయి వుంటాడులే అనుకుని ఓ సారి హోటలకు వచ్చాడు. మళ్లీ అలాగే "డబ్బులు లేవు తినమంటావా?" అని అడిగాడు.
"కావలసినంత తినండి. కానీ క్రితం బాకీ ఇవ్వండి శెట్టిగారు" అని అడిగాడు. పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది శెట్టికి. పాత బాకీ 3 రూపాయలే కదా, ఈ సారి ఆరు రూపాయలకు తిని, మొత్తం ఎగ్గొట్టొచ్చులే అనుకుని పొట్టకు పట్టినంత తిన్నాడు. రాత్రికి తినటానికి పొట్లం కూడా కట్టించుకున్నాడు. పాత బాకీ 3 రూపాయలు తీసి ఇవ్వబోయాడు. "ఉండండి పుస్తకం చూసి చెబుతా" అని పుస్తకం తెరిచాడు. అందులో 30 రూపాయలు ఉంది. శెట్టి సంగతి తెలిసే ఎందుకైనా మంచిదని ముందుగానే 3 పక్కన సున్నా పెట్టి ఉంచాడు మల్లన్న. పుస్తకంలో 30 రూపాయలు రాసివుంది. కింద శెట్టి సంతకం ఉంది. శెట్టి లబోదిబోమంటూ గోల చేసాడు. అక్కడ ఉన్నవారంతా పుస్తకం చూసి శెట్టినే తిట్ట సాగారు. చేసేదిలేక శెట్టి 30 రూపాయలు కట్టి వెళ్ళిపోయాడు. పిసినారి తనం వల్ల అసలుకే మోసం వస్తుందని తెలుసుకున్నాడు. అప్పటి నుండి శెట్టి పిసినారితనం మానుకున్నాడు. ఎప్పుడు డబ్బులు అప్పుడే కట్టి మంచి మనిషిగా మారాడు.
ఈ కథ ఆధారంగా ఈ 'అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న' అనే నానుడి వాడుకలోకి వచ్చింది.
0 Comments