చంద్రుడు హాయిగొలిపే వెన్నెలను ఇస్తున్నందుకు కృతజ్ఞతగా... ధరించిన తెల్లని కొత్త బట్ట నుండి ఒక నూలు పోగును లాగి, చంద్ర దర్శనం సమయంలో చంద్రునికి సమర్పించడం(చంద్రునివైపు విసరడం) ఒక ఆచారం.
ఇంకా చెప్పాలంటే... అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు చంద్రుడు మనకు మళ్లీ కనిపిస్తాడు. కృష్ణపక్షం ముగిశాక శుక్లపక్షంలో కనిపించేది మనకు విదియ నాడే. ఆ రోజు కనిపించే బాలచంద్రుడు క్రమక్రమంగా పెరిగి పూర్ణ రూపాన్ని సంతరించుకుంటాడు.
ఏదైనా ఇవ్వగలిగిన వాడికే... పుచ్చుకునే అధికారం ఉంటుంది. చంద్రుడు జ్ఞానానికి అధిపతి, మనః కారకుడు కూడా. మన మనసును, జ్ఞానాన్ని ప్రభావితం చేస్తాడంటారు. అందువలన మనకు వెన్నెల లాంటి చల్లని, తెల్లని (పవిత్రమైన) మంచి బుద్ధిని ప్రసాదించమని చంద్రునికి అడగాలి. ఇతరుల నుంచి మనది కానిది పొందే అధికారం నైతికంగా...వారికి మనం ఏదయినా ఇచ్చినపుడే కలుగుతుంది.
బుద్ధిని ప్రసాదించే చంద్రుడంతటి గొప్ప వారికి మనం ఏమి ఇవ్వగలము? ఏమిచ్చినా అంత గొప్పవాడి ముందు అవన్నీ దిగదుడుపే కదా!
ముందుగా ఉగాది తర్వాత వచ్చే చైత్ర శుద్ధ విదియనాడు *బాలేందు* *వ్రతాన్ని* చేస్తారు. కొత్త సంవత్సరంలో బాలచంద్రునికి జరిగే తొలి పూజ అన్నమాట. ఆనాడు మనం ధరించిన కొత్త తెల్లని బట్టలు నుంచి ఒక నూలు పోగును చంద్రునికి అర్పించి, జ్ఞానాన్ని అడుగుతాం. కొనసాగింపుగా ఆ తర్వాత ప్రతి నెలా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చే విదియ నాడూ నూలుపోగును సమర్పిస్తాం.
నిజంగా చంద్రుడు మనం విసిరే ఆ పోగును తీసుకుంటాడా? అంటే...తీసుకోవడం, తీసుకోకపోవడం కాదు ఇక్కడ. *ఇతరులకు ఇచ్చే గుణాన్ని నేర్పించటం, అలవాటు చేయడం అన్నదే విషయం.* మనము ఎంత ఇవ్వగలమో అంత... మన శక్తి కొలది ఇవ్వగలగటం అన్నమాట.
*మన శక్తిని అనుసరించి ఇతరులకు ఏదైనా ఒక కానుక ఇవ్వడం గానీ, సహాయం చేయడం గానీ చేస్తున్నప్పుడు ఈ జాతీయాన్ని వాడుతున్నాం.
0 Comments