*బహువ్రీహి సమాసం*

*బహువ్రీహి సమాసం*


 

వడ్లకంకికి బహువ్రీహి అని పేరు.

కంకిలో చాలా వడ్లగింజలుంటాయి గదా!

వ్రీహి అంటే వరి గింజ. ఆ పొత్తులో చాలా గింజలుంటాయి

బహువ్రీహి అనే పదమే బహువ్రీహి సమాసానికి ఉదాహరణ.

బహు పూర్వ పదం. వ్రీహి ఉత్తర పదం.

బహువ్రీహి అన్నపుడు ఎక్కువ గింజలు కలది అనే అర్థం వస్తుంది. అంటే ఆ పదం వినగానే —వడ్లూ, ఎక్కువ —పదాలకు అతీతమైన "వడ్ల కంకి" మనసుకు తోస్తుంది.

పూర్వ ఉత్తర పదాల అర్ధం కాకుండా వాటివల్ల స్ఫురించే వేరొక వస్తువు లక్ష్యం అయింది.

అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి…అని నిర్వచనం.

ముక్కంటి = మూడు + కంటి = మూడు కన్నులు గలవాడు.. శివుడు. ముక్కంటి అనగానే శివుడు స్ఫురిస్తాడు.

మూడు కాదు, కన్నులు కాదు.

చంద్ర శేఖరుడు - చంద్రుని శేఖరము (శిఖలో ధరించి ఆభరణం)గా కలవాడు - శివుడు.

చంద్రుడు, శేఖరము కాదు స్ఫురించేది.

మీనాక్షి = మీన + అక్షి - మీనముల వంటి అక్షులు కలది.(చేప ఆకారంలో ఉండే)

మృగాక్షి = మృగ + అక్షి = మృగము (లేడి) కనుల వలె చంచలమైన అక్షులు గలది అనాలి.

విగ్రహ వాక్యంలో కలవాడు, కలది అనే పదాలు వస్తాయి.

ఏ సమాసములో నైనను ప్రాథమికముగా కలియుచున్న రెండు మాటల అర్థమే ఆ సమాసపు మొత్తమర్థమై ఉండును.

కాని, బహువ్రీహిలో - కలియుచున్న రెండు మాటల కన్న వేఱైన (అక్కడ చెప్పఁబడని) మూఁడవ వస్తువే దాని అర్థమై ఉండును. ఇదియే బహువ్రీహిలోని బహు వింత.

ఇది ఆంగ్లవ్యాకరణంలోనికి కూడా ఎక్కింది. ఆంగ్ల వ్యాకరణవేత్తలు ఈ సమాసం నిర్వచనాన్ని లక్ష్య లక్షణాలను చూసి అబ్బురపడి ఆ పదాన్ని అలాగే ఆంగ్ల వ్యాకరణంలో వాడారు. 'ఎక్సో సెంట్రిక్ కాంపౌండ్' అన్నది దాని ఇంకో పేరు. 'డండర్ హెడ్' అంటే మూర్ఖుడైన వ్యక్తి. మనం కనిపెట్టిన 'ఐరన్ లెగ్' అంటే దురదృష్టవంతుడు. ఇవన్నీ బహువ్రీహి సమాసాలే.

ఇది కాక 'నఞ్ బహువ్రీహి' సమాసం కూడా ఉంది. కలవాడు/కలది బదులు లేనివాడు/లేనిది అన్న అర్థాలు ఇచ్చేవి. ఉదా: అచ్యుతుడు - చ్యుతము లేని వాడు (విష్ణువు);

Post a Comment

0 Comments