ఈ రోజు ముత్యాల సరాలు గురించి తెలుసుకొందాం!

ఈ రోజు ముత్యాల సరాలు గురించి తెలుసుకొందాం!

 ముత్యాల సరము అన్నది గురజాడ అప్పారావుగారు కల్పించిన ఒక అందమైన మాత్రా ఛందస్సు. వృషభ గతి రగడ, హరిణ గతి రగడ అన్న మాత్రా ఛందస్సులను ఆధారంగా తీసుకొని ఈ ఛందస్సును సృష్టించారని కొందరి అభిప్రాయం. కానీ గురజాడ గారు దానిని ఒక పారశీక ఛందస్సు ఆధారంగా కల్పించానని చెప్పారట. కన్నడ ఛందస్సులోని భామినీ షట్పది కూడా ముత్యాల సరాన్ని పోలి ఉంటుంది (ముత్యాల సరంలోని మొదటి మూడు పాదాలకు, మరొక మూడు పాదాలను కలిపితే అదే భామినీ షట్పది).



ముత్యాల సరములో మొదటి మూడు పాదాలలో ఏడు మాత్రల గణాలు రెండేసి ఉంటాయి (సాధారణంగా 3+4 మాత్రలతో రెండు పదాలు, లేక 4+3 మాత్రల పదాలైనా ఉండవచ్చు). నాలుగవ పాదంలో ఒక 7 మాత్రల గణం, చివరన మరో గురువు సాధారణంగా ఉంటాయి. గురజాడగారు 7 నుండి, 14 వరకు ఎన్ని మాత్రలైనా ఉండవచ్చని అన్నారు గానీ, 9 మాత్రలు (చివరి గురువుతో) ఉంచడమే ప్రామాణికంగా భావిస్తారు. గురజాడ గారు దీనికి యతి, ప్రాస నియమాలు చెప్పలేదు కానీ కొందరు కవులు ఐచ్ఛికంగా పాటించారు.

ముత్యాల సరాలు తాళయుక్తంగా, పాడుకోవడానికి అనువైన లయతో ఉంటాయి. ఇవి వ్రాయడానికీ, చదవడానికీ కూడా సులువుగా ఉంటాయి. త్రిమాత్రా గణాలు మూడు: వగణం (IU), హగణం (UI) , నగణం (III). ఇందులో లగం, తాళగతికి అనువుగా ఉండదు. కనుక సాధారణంగా వగణం, నగణం వాడుతారు. ఇక చతుర్మాత్రా గణాలు గగ (UU) నలం (IIII), భగణం (UII), సగణం (IIU), జగణం (IUI). ఇందులో జగణం కూడా తాళ గతికి అనువు కాదు. సాధారణంగా గగ, నల, భ, స గణాలు మాత్రమే వాడుతారు. కనుక ముత్యాల సరం యొక్క పాదం సాధారణంగా ఇలా ఉంటుంది:

{UI / III} - {IIII / UII / IIU / UU} ; {UI / III} - {IIII / UII / IIU / UU}

చివరి పాదం ఇలా:

{UI / III} - {IIII / UII / IIU / UU} ; U

 తెలుగు జనులకు గురజాడ అందించిన సొబగైన ఛందము ఈ ముత్యాల సరాలు. సరళమైన మధురమైన నడకతో వినసొంపుగా కనయింపుగా ఉంటాయివి.

ఈ నడకలో తన కవితలతో తెలుగు సాహితీ స్రవంతిలో నూతన ఒరవడిని మొదలిడినాడు గురజాడ. తన ముత్యాల సరాలతో సగటు చదువరికి/వినువరికి కవిత్వ తావిని చేరువ చేసినాడు.

భావకవుల కవితాలతలకు ఆలవాలమయింది ఈ ఛందోరీతి. మొత్తం భావకవిత్వంలో ముత్యాలు సరాలను ఒకసారైనా తడమని కవి లేడుట.
మనము మామూలుగా ఛందస్సులో గురువులు లఘువులు అంటున్నాము. అలాగే మాత్రాఛందస్సులో గురువుస్థానంలో రెండు మాత్రలు, లఘువు స్థానంలో ఒక మాత్ర అని భావించాలి. ఇక మాత్రా ఛందస్సుకు సంబంధించి మొదటి మూడు పాదాలు ౩+4, 3+4 చొప్పున 14 మాత్రలు గా మొదటి మూడు పాదాలు ఉంటాయి.నాలుగువపాదంలోమాత్రం 7 నుండి 14 మాత్రలలో ఎన్ని ఐనా ఉండవచ్చు.ఇదీ ముత్యాలసరాల ఛందస్సు.

Post a Comment

0 Comments