"పుల్లయ్యవ్వారం"

"పుల్లయ్యవ్వారం"
             03-01-2023
ఒకప్పుడు పుల్లయ్య అనే ఒక తెలివి తక్కువ వాడు ఉండేవాడు. ఒకరోజు రాత్రి వాడు పడుకుని ఉండగా వాడి తల్లిదండ్రులు మాట్లాడుకోవడం నిద్ర పట్టని అతడి చెవిన పడింది. "రేపు ఉదయం మన పుల్లయ్యని వేమవరం పంపుదాం" అని తండ్రి తల్లితో అనడం వాడు విన్నాడు. తన తండ్రి చెప్పేదాకా ఎందుకు ఆగాలని వాడు నిద్ర పట్టని కారణంగా లేచి వేమవరం బయలుదేరి వెళ్లి ఉదయానికల్లా తిరిగి వచ్చేశాడు. ఉదయం తండ్రి వాడిని పిలిచి "పుల్లయ్యా! నువ్వు ఒక్కసారి వేమవరం వెళ్లి రావాలి" అన్నాడు. వాడు తన ప్రయోజకత్వాన్ని తండ్రి మెచ్చుకుంటాడని హుషారుగా "నాకు తెలుసు. మీరు వెళ్ళమంటారని. అందుకే రాత్రి వెళ్లి వచ్చేశా" అన్నాడు.దాంతో అతని తండ్రి "ఎందుకు వెళ్ళినట్లు" అన్నాడు. "ఏమో !ఎందుకు వెళ్లాలో మీరు చెబితేగా?అమ్మతో వేమవరం వెళ్లాలని చెప్పారు" అన్నాడు వాడు. ఈ కథను బట్టి "పుల్లయ్యవ్వారం" అనే సామెత వాడుకలోకి వచ్చింది. "పుల్లయ్య వేమవరం వెళ్లినట్లు" అనే దానికి వ్యవహారంలో వచ్చిన క్లుప్త రూపం ఇది. ఎవరైనా ఒక పనిని అపసవ్యంగా చేసినప్పుడు ఈ సామెత పేర్కొంటారు.
రచన:-ధరణీప్రగడ శేషగిరిరావు
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు

Post a Comment

0 Comments