ఈరోజు ప్రముఖ భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త, పరిశోధకుడు, వైద్యుడు యల్లాప్రగడ సుబ్బారావు జయంతి

ఈరోజు ప్రముఖ భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త, పరిశోధకుడు, వైద్యుడు యల్లాప్రగడ సుబ్బారావు జయంతి
*******************************************************

యల్లాప్రగడ సుబ్బారావు ( Yellapragada Subbarow ) (12 జనవరి 1895 – 9 ఆగష్టు 1948 ) ప్రముఖ భారతీయ రసాయన శాస్త్రవేత్త, వైద్యుడు, ఆవిష్కర్త. జీవ రసాయన శాస్త్రం, ఔషధ శాస్త్రం, మైక్రోబయాలజీ, పోషకాహార శాస్త్రం మొదలైన రంగాలలో విశేషమైన కృషి చేశారు. ప్రాణాంతకమైన అనేక వ్యాధులకు చికిత్సలను కనుగొన్నారు. లాభాపేక్ష లేకుండా మానవాళికి ఉపకారం చేశారు. సుబ్బారావు గారు తన ఆవిష్కరణలను ఏనాడూ అమ్ముకోలేదు. పేటెంట్స్ తీసుకోలేదు.





సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో 1895 జనవరి 12 న జన్మించారు. ప్రాధమిక విద్య రాజమండ్రిలో, మెట్రిక్యులేషన్ మద్రాసు హిందూ హైస్కూలులో, ఇంటర్మీడియట్ ప్రెసిడెన్సీ కళాశాలలో, వైద్య విద్య మద్రాసు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడై ఖాదీ వస్త్రాలను ధరించారు. దాంతో ఆంగ్ల ప్రొఫెసర్లు ఆగ్రహించటం వలన ఆయనకు ఎంబిబిఎస్ పట్టా లభించలేదు. తక్కువ స్థాయి ఎల్ ఎం ఎస్ పట్టా మాత్రమే లభించింది. తర్వాత మద్రాసు ఆయుర్వేద కళాశాలలో ఉపన్యాసకుడిగా చేరారు.

1919 లో ఆయన తనకన్నా వయసులో చిన్నదైన శేషగిరిని వివాహమాడారు. 1923 లో పై చదువుల కోసం మామ గారి ఆర్థిక సహాయంతో  అమెరికాలోని బోస్టన్ చేరుకున్నారు. అక్కడ డా. రిచర్డ్ స్ట్రాంగ్ ఆర్ధికంగా ఆదుకొన్నారు. హార్వర్డ్ కళాశాలనుండి ట్రాపికల్ మెడిసిన్ లో డిప్లొమా పొందారు. 1940 లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఔషధ తయారీ సంస్థ లెడెర్ల్ ప్రయోగశాలలో చేరారు. ఎటిపి (ATP) పై ఆయన చేసిన పరిశోధనలకు గాను పిహెచ్ డి లభించింది.

పరిశోధనలు, ఆవిష్కరణలు
-------------------------------------
* డా. సైరస్ ఫిస్క్ ( Cyrus Fiske ) తో కలిసి రక్తంలోనూ , మూత్రంలోను ఉన్న ఫాస్ఫరస్ పరిమాణాన్ని  తెలుసుకోవడానికి ఫిస్క్-సుబ్బారావు పద్ధతిని రూపొందించారు.

* అన్ని జీవ రసాయన ప్రక్రియలకు అవసరమైన శక్తి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ (ATP) నుంచి లభిస్తుందని కనుగొన్నారు.

* కాలేయాన్నుంచి తీసిన  విటమిన్ బి 12 తో రక్త హీనతను నివారించ వచ్చని కనుగొన్నారు. రక్త హీనత చికిత్సకు వాడే ఫోలిక్ ఆమ్లాన్ని సంశ్లేషించారు.

* క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే మెథాట్రెక్సేట్ ను కనుగొన్నారు.

* ఫైలేరియా చికిత్సకు ఉపయోగపడే డైఇథైల్ కార్బమజీన్  (Diethylcarbamazine : Hetrazan )ను కనుగొన్నారు.

* యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్ ( Aureomycin ) ఆవిష్కరణకు సారధ్యం వహించారు.

సుబ్బారావు సహచరుడు, 1988లో గెట్రూడ్ ఎలియాన్‌తో కలిసి వైద్య శాస్త్ర నోబెల్ బహుమతి పంచుకొన్న జార్జ్ హిచ్చింగ్స్ మాటల్లో: "ఫిస్క్, అసూయతో సుబ్బారావు పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడం వలన సుబ్బారావు కనుగొనిన కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది".

సుబ్బారావు గారి గౌరవార్థం ఒక శిలీంధ్రానికి ఆయన పేరు పెట్టారు- Subbaromyces splendens. టాంజానియా జాతికి చెందిన ఒక జంపింగ్ స్పైడర్ కు సుబ్బారావు గారి జ్ఞాపకార్ధం Tanzania yellapragadai అని పేరు పెట్టారు.

న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ యల్లాప్రగడ సుబ్బారావు గారిని 'శతాబ్దపు ప్రశస్తమైన వైద్య మేధస్సు'గా అభివర్ణించింది.

1948 ఆగష్టు 9 న తీవ్రమైన గుండె పోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 53 సంవత్సరాలు మాత్రమే.

సుబ్బారావు గారి శత జయంతిని 1995లో నిర్వహించారు. ఆయన కనుగొన్న ఆవిష్కరణలు నోబెల్ బహుమతికి అర్హమైనవే కానీ ఆయన ఆ పురస్కారానికి నోచుకోలేదు.

ఈరోజు ప్రముఖ భారతీయ జీవ రసాయన శాస్త్రవేత్త, పరిశోధకుడు, వైద్యుడు యల్లాప్రగడ సుబ్బారావు జయంతి

Post a Comment

0 Comments