*👩🏻‍🏫నేటి ప్రాముఖ్యత🤵🏻‍♀*

           *🗒️ఆగస్టు 29*

█▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓▓█

*👳🏽‍♀️తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి గారి  జయంతి ,  “తెలుగు భాషా దినోత్సవం”👳🏽‍♀️* 

━──────────────────━
 *గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారం లోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియ జెప్పిన  మహనీయుడు , ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడు, బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింప జేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు వెంకట రామమూర్తి* గారు.  


గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. 

గిడుగు వెంకట రామమూర్తి గారు 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవై మైళ్ళ దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు
జన్మించారు. 
అతని తండ్రి వీర్రాజు పర్వతాలపేట  ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవారు. 1875దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి చోడవరంబదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయారు.

విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి గారు మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1875 మొదలు 1880 వరకు విజయనగరంలో గడిపారు. 1879 లో మెట్రిక్యులేషన్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు గారు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే రామమూర్తికి పెండ్లి అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారంలో చరిత్ర బోధించే అధ్యాపకుడైనారు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తి పై బడింది. ప్రైవేటుగా చదివి 1886 లో ఎఫ్‌.ఏ., 1894 లో బి.ఏ. మొదటి రెండు భాగాలు (చరిత్ర తప్ప) ప్యాసయ్యారు. 1896 లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నారు.అప్పుడు అతనికి కళాశాల తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవర ల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు వ్రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారాయన. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913 లో
 *"రావు బహదూర్‌"*  బిరుదు ఇచ్చారు. 

భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931 లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936 లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931 లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938 లోను అచ్చువేశారు. 1934 లో ప్రభుత్వం అయనను *'కైజర్-ఇ-హింద్ '* అనే స్వర్ణ పతకం ఇచ్చి గౌరవించింది.

హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగదేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివారు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయుల గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు వ్రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించారు. 

1911 లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. 

మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.

1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.

ఆయన రచనలలో ముఖ్యమైనవి 'బాలకవి శరణ్యము', 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము', గద్యచితామణి' వంటి రచనలు చేసారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు గిడుగు వారు.

గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించు కోగలుగుతున్నాం.

గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన, చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పాలి.

గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల తెలుగు అకాడమీ 2014-2016 లో రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది. ఆ రచనలమీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలుకావలసి ఉంది. ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా 'భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు ' అని మనకి తెలుస్తూ ఉంటుంది.

✦━━━━━━━━✤━━━━━━━━✦

       

Post a Comment

0 Comments