ఛందో గ్రంథాలలో వివరించబడేవి యతి ప్రాసలు.
ప్రతి పద్యపాదంలోనూ మొదటి అక్షరం యతి. రెండోది ప్రాస. తెలుగు పద్యాలలో చాలా వాటిల్లో యతి ప్రాసలు పాటిస్తారు. యతి అంటే విశ్రాంతి.
పెద్ద పాదాలు ఏకబిగిని చదవడం అసౌకర్యం కాబట్టి అక్కడక్కడ విశ్రాంతి అవసరమౌతుంది. ఆ విశ్రాంతి ప్రదేశం పద్యం నడకనుబట్టి మారుతూ ఉంటుంది. దాన్ని యతిమైత్రి స్థానము అంటారు.
కంద పద్యంలో 1, 3 పాదాలు చిన్నవి. యతి స్థానం అక్కర్లేదు. 2, 4 పాదాలు పెద్దవి. యతిస్థానం అవసరం.
*గాండీవజ్యారవంబు*త్కటమయి పెలుచం* గ్రమ్మినన్ భీముబాహా *—ఇది స్రగ్ధర . ఇందులో రెండు చోట్ల యతి అవసరమయింది.
******
యతులను 41 రకాలుగా అప్పకవి విశదీకరించాడు.
భీమన కవిజనాశ్రయము అతి ప్రాచీన ఛందో గ్రంథం. అందులో పది యతుల పేర్లే చెప్పాడాయన. అనంతుడు, అప్పకవి వాటినే విడమరచి చెప్పడంలో సంఖ్య పెరిగింది.
ఏ అక్షరానికి ఆ అక్షరం సరిపోతుంది. అచ్చైనా హల్లైనా..
అ య హ లు సమానం. యతి మైత్రి చెప్పవచ్చు. య హ లతో పాటు అచ్చుల మైత్రి పైన చెప్పినది తప్పనిసరిగా పాటించాలి.
హితులు భిషక్ గ్రహజ్ఞ బుధ బృంద కవీంద్ర పురోహితుల్ హితా…(ఆముక్తమాల్యద 4–273)
ఇందులో హి లోని ఇ మాత్రమే స్వీకరించి బృ లోని ఋకారానికి మైత్రి చెప్పారు. ఋకారం విషయంలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉండబట్టి ఇక్కడ హ కు మైత్రి యైన హల్లు చేరలేదు. బృ లోని బ్ ఇక్కడ ఋ వల్ల విస్మృతం (ఇగ్నోర్) అయింది
ఇది ఋత్వ సంబంధ యతి.
అంటే ఐ —హౌ— యై —యా —ఔ — ఇలాగా అక్షరాలకు యతి మైత్రి చెప్పవచ్చు. దీనికి సరసయతి అని పేరు పెట్టారు.
ర ఱ లకు విరోధం. యతిలో ఐనా, ప్రాసలో ఐనా, దేనికదే గానీ ర — ఱ లకు ఒకదానికొకదానికి యతి గానీ, ప్రాస గానీ చెప్పగూడదు.
బేసిక్స్ ఇవి.
1. అ ఆ ఐ ఔ — పరస్పరం మైత్రి
2. ఇ ఈ ఋ ౠ ఎ ఏ (—do—)
3. ఉ ఊ ఒ ఓ ( —do— )
అనే మూడు గ్రూపులుగా అచ్చులను పరిగణిస్తారు.
ఏ యతిలో ఐనా ఈ అచ్చు మైత్రి చెడగూడదు. హల్లులతో చేరిఉన్నప్పుడు గూడా ఈ అచ్చు కుదరడం తప్పనిసరి.
కాళియోరగవైరి కైటభారి —
ఈ పాదంలో క —కై లకు యతి. క రెండు చోట్ల వస్తూ అ — ఐ గూడా కలిసి వచ్చాయి.
ఇనతనూభవ మిత్ర లం కేశ జైత్ర
ఇక్కడ కే ఉన్నా లంకా + ఈశ అని పదవిభాగం కాబట్టి
రెండో పదం మొదట ఉన్న ఈ మాత్రమే గ్రహించాలి.
ఇక్కడ ఇ—ఈ లకే యతి చెప్పారు. కే లోని క్ గ్రహించగూడదు. సంధి వచ్చినపుడు రెండో పదంమొదటి అక్షరమే యతికి పనికి వస్తుంది.
జనులవునటంచు సమ్మతింప
ఇక్కడ జ — జనులు పదంలోది.
దీన్ని జ్+ అ అని విరిచి, జ లోని అ కు మాత్రం యతి చెప్పడం తప్పు.
జ మొత్తం గ్రహించి, జ్ కు సరిపడే స్ & అ కు సరిపడే అ రెండూ మైత్రి స్థానంలో చెప్పాలి. (ఇది సరసయతి—25 వది.)
ఇలాగే హల్లుల విషయంలోనూ. హల్లు సరిపోతూ అచ్చు గూడా పైన చెప్పిన గ్రూపులకు సరిపోతూ ఉండాలి.
కఖగఘ ఇవి ఒక సెట్. అచ్చు ఆ గ్రూప్ లోది వస్తూ ఈ హల్లులు ఏదో ఒకటి ఉండాలి.
కంధిమధ్య గేహ ఖండితారి సమూహ
క్—ఖ్ -హల్ మైత్రి & క లోని అ — ఖ లోని అ చేరాయి.
(ఇక్కడ — కంధిమధ్య గేహ—పూర్వదేవ వినాశ— అనగూడదు.
క్ —ప్ లకు హల్ మైత్రి కుదరదు & క లోని అ తో.. పూ లోని ఊ కు మైత్రి కుదరదు.) [పూర్వదేవులు అంటే రాక్షసులు]
ముందు సున్న ఉంటే ఆయా వర్గల అక్షరాలు తమ చివరిదైన అనునాసికంతో మైత్రి పొందుతాయి.
కఖగఘఙ ఒక వర్గం. కానీ కఖగఘలకు మాత్రమే స్నేహం. ఙ వీటితో చేరదు. ఐతే —లంక లో సున్నతో క కలిసి ఉన్నది గాబట్టి క తో ఙ కు మైత్రి కుదురుతుంది.
న గధరాయ నమోస్తు సౌంద ర్యవిజిత
ఇక్కడ న తో — సున్నతో కలిసి ఉన్న ద కు యతిమైత్రి చెప్పారు.
నిజానికి ఇది సంయుక్తాక్షర యతి. ఈ యతి ప్రకారం సంయుక్తాక్షరమై రెండు మూడు హల్లులు కలిసి ఉన్నా, ఏ ఒక్క హల్లునైనా, యతికి స్వీకరించవచ్చు.
సౌందర్య— అనేది ఎట్లా వ్రాసినా పలికేది - సౌన్దర్య అనే గదా! న్ద లో న్+ ద్+ అ చేరి ఉన్నాయి గదా !
ఈ న్ కు నగధరాయ లో తొలుత ఉన్న న్ తో మైత్రి చెప్పారు అనేది అసలు విషయం.
మామూలుగా *నాకేమి *పదంలో 'కే ' యతిస్థానంలో వస్తే
నాకు + ఏమి —అని విభజన గాబట్టి ఏ కు మాత్రమే యతి చెప్పాలి. క లేనట్టే అనుకోవాలి.
కానీ కొన్ని పదాలు సంధిఅయి, సంధి లేనట్టే అనిపిస్తూ ఉంటాయి. వాటి విషయం ప్రత్యేకంగా చెప్పారు.
సంధియైనట్టుగా కనబడని పదాలలో మాత్రమే హల్లుకు యతిమైత్రి చెప్పవచ్చు అని కొన్ని పదాలను చెప్పారు.
నాక అనేది సంస్కృత పదం. (దుఃఖం లేని చోటు - స్వర్గం)
ఇందులో న + అక అనే రెండు పదాలు ఉన్నా ఏకంగా అనిపిస్తుంది. ఇక్కడ మామూలుగా ఐతే న + అకలో రెండో పదంలోని అ కు మాత్రమే యతి చెప్పాలి. కానీ న కు గూడా చెప్పారు ప్రాచీన కవులు.
ననునేసిన గాని యనుడు నాకేశ సుతున్ (విరాట పర్వం)
నాస్తి లో న + అస్తి
స్వాంతము స్వ+ అంతము
అపః అశనము = అపోశనము నార + అయన = నారాయణ
ఇలాంటి ఏకపదం అనిపించే పదాలలో మాత్రమే హల్లుకు మైత్రి చెప్పవచ్చు. వీటిని నిత్య సమాస యతులుగా చెప్పారు.
ఇలాగే తెలుగు పదాలలో గూడా ఏసి, ఏని మొదలైన ప్రత్యయాలు (ఏసి , ఏని —విడిగా విభాగార్థంలో వాడము) చేరినపుడు గూడా అచ్చుకూ చెప్పవచ్చు. హల్లుకూ యతి చెప్పవచ్చు.
రామయ్య సీతమ్మ లలో గూడా మ, త లకు ఏక పదంగా భావించి యతి చెప్పవచ్చు.
ప్రతిచోటా ఇలా చేయగూడదు అని రూల్.
దేవాలయము లో 'వా లోని ఆ కు' మాత్రమే యతిమైత్రి చెప్పాలి. సర్వేశ్వరుడు లో ఈ కి మాత్రమే యతి చెప్పాలి..
అన్ని సంధుల్లోనూ సంధిగతంగా కనబడే హల్లుకు యతి చెప్పడం తప్పు.
ఏకపదంగా వాడుకలో ఉండే సమాసరూపాలకే ఈ అచ్చులకూ హల్లులకూ యతి సరిపుచ్చే నియమం. అచ్చుకు చెప్పడం సర్వసామాన్యమే. హల్లుకు యతి చెప్పాడమే విశేషం. (అందుకే ఉభయ యతులని వీటికి పేరు పెట్టారు.)
రెండో అక్షరం ప్రాస. ఇందులో అచ్ఛు మారవచ్చు. యతిలో లాగా అచ్చు మైత్రి అసలు పనిలేదు. హల్లులు మాత్రం ఏ వరసలో మొదటి పాదంలో ఉంటే— అదే వరసలో రావాలి.
థ ధ లకు మాత్రమే ప్రాస మైత్రి. మిగిలిన చోట్ల అన్ని హల్లులూ ప్రతి పాదంలోనూ రావలసిందే. తప్పదు.
రు ఋ ఉచ్చారణ సమానంగానే అనిపిస్తుంది గాబట్టి ర ఋ లకు ప్రాస అరుదుగా కనిపిస్తుంది.
ఆ ఋషి పుత్రుడు గట్టిన
చీరలు మృదులములు (కంద పద్యం - ఆరణ్య. 3–104)
ఇక్కడ ఒక్క నియమం తప్పక పాటించాలి. అది ప్రాస పూర్వాక్షర నియమం.
మొదటి పాదంలో ప్రాసముందు అంటే మొదటి అక్షరం లఘువుగా ఉంటే— మిగిలిన మూడు పాదాలలోనూ మొదటి అక్షరం లఘువే కావాలి.
యతి కుదరనపుడు సీసం, తేటగీతి, ఆటవెలది మంజరీద్విపదల్లో ప్రాసయతి చెప్తారు. అక్కడ గూడా ఈ నియమం పాటిస్తారు.
దాసపారిజాత వాసవావరజాత!
ఇక్కడ స —స లకు ప్రాసయతి. (దా—వా లకు యతి కుదరదు గాబట్టి) & దా, వా లు రెండూ గురువులు )
స్థూలంగా ఇది పరిచయం.
అఖండయతి పూర్వకవులు పాటించలేదని పలువురి మతం.
కన్నుల /nకఖిలార్థ లాభముల్ కలుగుచుండు (పోతన). కన్నులకు (న్)+ అఖిల. ఇక్కడ అ మాత్రమే గ్రహించాలి.
కానీ యతి స్థానంలో —కలుగు అని ఉంది. అది విరవగూడదు. కలుగుట ఒక పదం. (విరిచినపుడు ఆ రెండు పదాలకూ ఆ అర్థంతో సంబంధం ఉండాలి.)
ఇందులో అఖండయతి ఉన్నది. భారతంలో ఇలాంటివి లేవని ఒక వాదన.
నా మనసారదీని గని నప్పుడు — కనిన + అప్పుడు— విరిగింది. మొదట ' నా' ఉంది. విరగలేదు.
ఈ' నా— న' లకు మైత్రి చెప్పడం అఖండయతి చేసినట్లు ఔతుంది. ఇవి తప్పుపాఠాలనీ, పూర్వకవి విరచితాలు కాదు అనీ లాక్షణికులు వాదించారు. వేరే పాఠాలు చూపారు.

0 Comments