గుణములతో కూడిన పదముల సంఘటనకే రీతి అని పేరు. మాధుర్యము, ప్రసాదము మొదలైనవి గుణాలు. ఈ గుణాలు చేత విశిష్టమైన పదరచనే రీతి అంటారు. ఇది మూడు రకాలు. ఒకటి వైదర్భి. రెండు గౌడి. మూడు పాంచాలి. ఈ మూడును దేశ నామాలను బట్టి ఏర్పడిన పేర్లు. విదర్భదేశాన ఆదరించబడినది వైదర్భి, గౌడ దేశాన ప్రచారం పొందిన రీతి గౌడి. పాంచాల దేశాన ప్రసిద్ధి పొందిన రీతి పాంచాలి.
రుద్రటుడు లాటియా అను మరొక రీతిని కూడా పేర్కొన్నాడు. భోజుడు మాగధి, అవంతి అని మరో రెండు రీతులను పేర్కొన్నాడు. ధ్వని కారుడు మూడు రీతుల్ని ఆమోదించెను. రీతియే కావ్యాత్మని వామనుని సిద్ధాంతం.
విశిష్ట పదరచనే రీతి అని అంటారు. విశిష్టమనగా గుణ విశిష్టమనియు వివరణ. రీతి అనగా మార్గమని అర్థం. రస పదవిని క్రమముగా పొందుటకు మార్గమైనదే రీతి అని భావం. గుణములు నడుచుటకేది మార్గము అదే రీతి. రీతులు అర్థ వృత్తులను వ్యక్తపరుస్తాయి. రీతులు అర్థవృత్తులను ఆశ్రయించి ఉండును. రీతుల్లోని బేధాలను ప్రద రచనా స్వభావాన్ని బట్టి ఏర్పడినవి. కోమల పదరచన, ప్రౌఢ రచన, ఉభయ పదరచన అనే విశ్లేషణా వల్ల వరుసగా కోమల వైదర్భి, ప్రౌఢ గౌడి, ఉభయ పాంచాలి అను రీతులు ఏర్పడినవి. ఇదే వరుసగా కైశికి ఆరభటి, సాత్వతి అను వృత్తులను వ్యక్తం చేస్తాయి. అలంకార శాస్త్ర గ్రంథంలో కౌశికి ఆరభటి, సాత్వతి అను వృత్తులు వైదర్భి గౌడి, పాంచాలి, పాకాలైన ద్రాక్ష, కదళీ, నారికేళ మొదలైన పాకాలు, శయ్యా మొదలైనవి అన్నియు ఒకదానికొకటి పెనవేసుకున్నాయి.
ఇది ప్రాధమిక అవగాహన కోసం మాత్రమే. పూర్తి అవగాహనకు అలంకార గ్రంథాలు చదవాలి.
-పైడి నాగ సుబ్బయ్య.
0 Comments