"బేట్రాయి సామి దేవుడా" పల్లవి:- బేట్రాయి సామి దేవుడా--నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమిరాయుడా--కదిరి నరసిమ్ముడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా (బేట్రాయి) శాప కడుపు సేరి పుట్టగా--రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి

"బేట్రాయి సామి దేవుడా"


                    
పల్లవి:-
బేట్రాయి సామి దేవుడా--నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమిరాయుడా--కదిరి నరసిమ్ముడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా
                               (బేట్రాయి)
శాప కడుపు సేరి పుట్టగా--రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బమ్మదేవరకిచ్చినోడ
                                 (బేట్రాయి)
తాబేలై తాను పుట్టగా --ఆ నీల్లకాడ
దేవాసురులెల్ల కూడగా
దోవసూసి కొండ కింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ
                                 (బేట్రాయి)
అందగాడనవుదు లేవయా--గోపాలగో
విందా రచ్చించా బేగ రావయా
పందిలోన సేరి  కోరపంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవెకాద
                                  (బేట్రాయి)
నారసిమ్మ నిన్నే నమ్మితి--నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి  ప్రహ్లాదుగాచి
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసి నోడ
                                  (బేట్రాయి)
బుడుత బాపనయ్యవైతివి--ఆ శక్కురవరితి
నడిగి భూమి నేలుకుంటివీ
నిడువు కాళ్ళోడివై అడుగునెత్తి పైనబెట్టి
తడవులేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ
                                    (బేట్రాయి)
రెండు పదులు ఒక్కమారుతో --ఆ దొరలనెల్ల
సెండాడినావు పరశుతో
సెండ కోల బట్టి కోదండరామ సామికాడ
బెండు కోలసేసి కానీ కొండకాడ కేగినోడ
                                     (బేట్రాయి)
రామదేవ రచ్చించ రావయా--సీతమ్మ తల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమభక్తి నాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను ‌సేసినోడ
                                        (బేట్రాయి)
దేవకీదేవి కొడుకుగా--ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూలమేపుకోనీ ఆడోళ్ళా కూడుకొనీ
తావు బాగా సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ
                                       (బేట్రాయి)
ఏదాలు నమ్మరాదని ఆ శాస్త్రాలా
వాదాలు బాగ లేవనీ  
బోధనలూ సేసుకొనీ బుద్ధూలు  సెప్పుకొనీ  
నాదా వినోదుడైన నల్లనయ్య నీవెకాద   
                                    (బేట్రాయి)
కలికి నాదొరవు నీవెగా--ఈ జగములోన
పలికినావు బాల శిశువుడా
చిల్లకట్టు పురములోన బిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవి సేతబట్టి పేటపేట తిరిగి నోడ----
                                   (బేట్రాయి)
ఈ పాట యాభై సంవత్సరాల క్రితం గుళ్ళల్లో
పాడుకునే భజన గీతాల్లో ఒకటి.విష్ణుమూర్తి
దశావతారాలమీద ఈ పాట ఉంది. ఈ 
 పాటను 'అత్తారింటికి దారేది'సినిమాలో
పల్లవి,ఒక చరణం పెట్టారు. పూర్తి పాట ఇది.

సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు ఎస్:ఏ.తెలుగు
               మునిపల్లి.

Post a Comment

0 Comments