తెలుగు సంధులు మరియు సంస్కృత సంధులకు సంబంధించిన పదాలనూ ఎలా గుర్తించాలి..... దయవుంచి చెప్పండీ 🙏🙏🙏 1. మహాప్రాణ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. శంఖం, సంఘం, ఛత్రం, ఝషం, పాఠం మొ. 2.శ, ష, హ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. శివుడు, షణ్ముఖుడు, హరి మొ.

తెలుగు సంధులు మరియు సంస్కృత సంధులకు సంబంధించిన పదాలనూ ఎలా గుర్తించాలి..... దయవుంచి చెప్పండీ 🙏🙏🙏




1. మహాప్రాణ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. శంఖం, సంఘం, ఛత్రం, ఝషం, పాఠం మొ.

2.శ, ష, హ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. శివుడు, షణ్ముఖుడు, హరి మొ.

3. విసర్గ ఉన్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. 
అంతఃపురం, తపః ఫలం, వయః పరిమితి మొ.

4. ఋ, ౠ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. ఋషి, ఋతువు, ఋణం, ఋక్షం, పితౄణం మొ.

5. ఐ, ఔ వర్ణాలున్న పదాలు సంస్కృత పదాలు. అచ్చ తెలుగు కావు. ఐక్యం, ఐకమత్యం, ఐశ్వర్యం, ఔషధం, ఔచిత్యం మొ.

6. పదంలో పరుష, సరళాలు కాకుండా, స్థిర వర్ణాలకు పూర్వం బిందువు (సున్నా) ఉన్న పదాలు సంస్కృత పదాలు. 
పింఛం, ఝంఝ, శుంఠ, హింస,  సంశయం, సంవత్సరం, సంయమనం, సంరంభం మొ.

7. దీర్ఘాంత పదాలు అచ్చ తెలుగు పదాలు కావు. సంస్కృత పదాలు గానీ, ఇతర భాషా పదాలు గానీ అవుతాయి.
రమా, సీతా, నదీ, ,స్వారీ, పేచీ, గాభరా, గోరీ, లారీ, బెంచీ మొ.

8. ఏకపదంలో రెండు దీర్ఘాచ్చులు పక్కపక్కన ఉండే పదాలు అచ్చతెలుగు కావు. అన్యదేశ్యాలు.
రాజీనామా, తమాషా, ఫర్మానా, జరిమానా మొ.

9. సంయుక్త వర్ణాలు ( పదంలో ఒక హల్లు ‌కింద అదే హల్లు కాకుండా భిన్న హల్లు ఒత్తుగా వచ్చినవి) ఉన్న పదాలు సంస్కృత పదాలు. 
అగ్ని, రక్తం, క్రమం,‌ న్యాయం, వ్యధ, తత్త్వం, జ్యోత్స్న మొ.

10. ద్విత్వ వర్ణాలు ( ఒక పదంలో ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చినవి) ఉన్న పదాలు అచ్చతెలుగు పదాలు. (తద్భవాలు కూడా అచ్చతెలుగు లో భాగమే).
అక్క, అన్న, నెత్తురు, పొద్దు, కట్ట, తప్పు, దెబ్బ, కొమ్మ మొ.

11. ఎ, ఒ అనే అచ్చులున్న పదాలు అచ్చ తెలుగు పదాలు. సంస్కృత పదాలు కావు.
ఎలుక, ఎక్కడ, ఎట్ల, ఒకటి ఒండు, ఒట్టు, ఒప్పు, ఒత్తు మొ.

12. శకట రేఫ ( బండీ ఱ) ఉన్న పదాలు అచ్చ తెలుగు పదాలు. సంస్కృత పదాలు కావు
చెఱువు, చెఱుకు, నీఱు, వేఱు, కాఱు, దూఱు, గుఱ్ఱం, గొఱ్ఱె మొ.

13. పరుష, సరళాలకు పూర్వం సున్నా ఉండే పదాలు అచ్చ తెలుగు పదాలు. 
కంకి, పంచె, మంట, కంత, కంప, పంగ, గుంజ, మండ, బొంద, చెంబు మొ.

14. "ఫ" fa వర్ణం ఉన్న పదాలు అచ్చ తెలుగు కావు. ఇంగ్లీషు పదాలు గానీ, ఉర్దూ పదాలు గానీ అవుతాయి. కాఫీ, ఆఫీసు, ప్రొఫెసర్, ఫర్మానా, ఫౌజు, తరఫ్ మొ.

15. అరసున్నా ఉన్న పదాలు అచ్చ తెలుగు. సంస్కృత పదాలు కావు.
కూఁతురు, ఏఁడు, వాఁడు, చీఁకటి, ఆఁడది మొ.
16. దంత్య  ౘ,  ౙ లు ఉండే పదాలు అచ్చ తెలుగు పదాలు. సంస్కృత పదాలు కావు. 
చుక్క, చూపు, చొప్ప, చోటు,‌ జున్ను, జూలు, జొన్న, జోలె మొ.
17. ఉపసర్గలు ఉండే పదాలు అచ్చతెలుగు కావు, సంస్కృత పదాలు.
ఆ-హారం, వి-హారం, సం-హారం, ఉప-హారం, ప్ర-హారం, ఉప-సం-హారం మొ.

18. "య" వర్ణంతో మొదలయ్యే పదాలు అచ్చతెలుగు కావు. సంస్కృత పదాలు. యముడు, యాత్ర, యతి, యత్నం, యవ్వనం మొ.

ఈ నియమాలు స్థూలమైనవి మాత్రమే. నూటికి నూరుశాతం కచ్చితమైనవి కావు. వీటికి కొన్ని అపవాదాలు ఉండొచ్చు. అయినా, ఈ నియమాలు పదాల మూల భాషలను గుర్తించడానికి చాలావరకు ఉపయోగపడతాయి.

అచ్చ తెలుగు పదాలు నూ, సంస్కృత పదాలనూ, అన్యదేశి పదాలనూ సులభంగా గుర్తించడానికి "తెలుగు సందేహాలు" అనే ఫేస్బుక్  గ్రూపులో నేను రాసిన సూచనలు.

DR Bhujanga Reddy

Post a Comment

0 Comments